పాదుషావారు పరిచారకుడు | Akbar Birbal Vignanam Kathalu in Telugu

పాదుషావారు పరిచారకుడు

Akbar Birbal Vignanam Kathalu in Telugu

Akbar Birbal Vignanam Kathalu in Telugu: అక్బరు పాదుషావారు నిద్రలేస్తూ అంతఃపుర పరిచారకుని ముఖం చూచేరు. ఆ పరిచారకుడు కూడా తెల్లవారుతూనే తొలిసారిగా పాదుషావారి ముఖం చూచేడు.

ఆనాడు దర్బారునందు పాదుషావారికి అన్నియు విరుద్ద వ్యవహారములు ప్రసంగములు సంభవించినవి. యేపని సవ్యముగా సానుకులమొనర్చబడలేదు.

పైగా వేటకు వెళ్ళిన పాదుషావారికి ఒక్క మృగముకూడా వేటకు చిక్కలేదు. అలసట చెందిన అక్బరు విశ్రాంతి కొరకై ఒకవటవృక్షమునీడను గుర్రమును దిగబోగా కాలికి చిన్న దెబ్బ తగిలినది.

ఆరోజు స్థితిగతుల గురించి ఎందుకలా జరిగినవని యోచించుకొనచుండగా ఉదయమున తాను తన పరిచారకునిముఖము చూచిన విషయము జ్ఞప్తికి వచ్చింది.

ఈనాడు సంభవించిన దుస్సంఘటనలకు తాను సేవకుని ముఖం చూచుటే కారణమని తోచింది. వెంటనే ఆ సేవకుడ్ని ఉరితీయవలసినదిగా తలారులకు ఆజ్ఞాపించెను.

సేవకుడు ఘోడు ఘోడున విలపిస్తూ బీర్బల్ వద్దకు పరుగు పరుగున వెళ్ళి విషయాన్ని వివరించి తనను కాపాడవలసినదని, తాను ప్రభువులకు తెలిసి తెలిసి యే అపచారం చెయ్యలేదని రోధించేడు.

బీర్బల్ వానిని ఊరడించి తనవెంట ఆ పరిచారకుడ్ని అక్బరు వద్దకు తీసుకుని వెళ్ళేడు. ఇదేమిటి వీడ్ని ఇంకా ఉరితియ్యలేదు.

ఎందుకు వీడ్ని నీవెంట నావద్దకు తీసుకువచ్చేవని కసురుకున్నాడు అక్బరు. ప్రభూ! వీడు తమతో ఒక ఫిర్యాదు చేసుకోవాలని అందుకు తనను మీవద్దకు తీసుకు వెళ్ళమని నా వద్దకు వచ్చేడు.

ఫిర్యాదును మీకు విన్నవించుకున్న తదుపరి వీడు తమ అజ్ఞానుసారం మరణశిక్ష అనుభవించెదనని అనుచున్నాడు అని వివరించాడు బీర్బల్.

ఏమిటా ఫిర్యాదు? అని అక్బరు ప్రశ్నించాడు. ఈ ఉదయం మీరు వాని ముఖం చూచినప్పుడే వాడికి మీముఖం చూడడం జరిగిందట. వాడి ముఖం చూచిన మీకు వ్యవహారం సాగకపోవడం, చిన్నగాయాలు కలిగాయి.

కాని వాడికి మీ ముఖం చూడడంవల్ల ప్రాణాపాయమే సంభవించినదట. పాదుషావారు తగువిచారణ చేసి తనకు న్యాయము కలిగించవలసినదని పాడుముఖం ఎవరిదో నిర్ణయించవలసినది కోరుచున్నాడు.

బీర్బల్ మాటలకు విస్తుబోయి. తనతొందరపాటును గ్రహించుకుని వాని శిక్షను రద్దుచేసి వానికి కానుకలిచ్చి తననేరాన్ని తెలియజెప్పినందుకు బీర్బలు అభినందించాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment