మాయా టోపీలు | Famous Telugu stories

మాయా టోపీలు

Famous Telugu stories: ఓసారి గోదావరి పుష్కరాలప్పుడు పరమానందయ్య శిష్యులు పదిమంది పుణ్యస్నానానికని వెళ్లారు. ఎవరికీ ఈతరాకపోవడం వల్ల ఒకరిచేతులు ఒకరు గట్టిగా పట్టుకుని మునకలు వేశారు.

పైకి లేవగానే ‘అరెరె! చేతులు విడిపోయాయే… మనలో ఎవరైనా గల్లంతై ఉంటారు. ఓసారి లెక్కపెడదాం!’ అన్నాడు శిష్యుల్లో పెద్ద వాడు.

వెంటనే ఒకటీ, రెండూ, మూడూ… అని లెక్కపెడితే తొమ్మిది మంది లెక్కతేలారు. అదిచూసి అతని పక్కవాడు ‘మీకస్సలు లెక్కలే రావు. నేను లెక్కపెడతా చూడండీ..’

అని మళ్లీ మొదలు పెట్టాడు. అప్పుడూ తొమ్మిది ఉన్నారు. మూడో అతనూ, నాలుగో అతనూ లెక్క పెట్టినా ఇదే తంతు! అప్పటికే ‘మనవాళ్లలో ఎవరో గోదార్లో కలిసిపోయారు’ అంటూ కొందరు ఏడవడం మొదలుపెట్టారు.

వీళ్ల వాలకాన్నంతా ఓ టోపీల వ్యాపారి గమనిస్తూ ఉన్నాడు. ప్రతి శిష్యుడూ తనని తప్ప మిగతా వాళ్లందరినీ లెక్కపెడుతున్నందువల్లే తేడా వస్తోందని తెలుసుకు న్నాడు.

వాళ్లదగ్గరకెళ్లి ‘స్వాములూ! మీ లెక్కలో తప్పుంది..’ అని చెప్పబోయేంతలోనే ‘మూర్ఖుడా… మేం ఎవరనుకున్నావ్? పరమా నందయ్య శిష్యులం! అక్షరం ముక్కరాని నువ్వా మమ్మల్ని తప్పు పట్టేది. పో..పో!’ అంటూ తరిమేశారు.

అక్కణ్ణుంచి వెళ్లబోతున్న వ్యాపారికి ఓ ఉపాయం తట్టింది. వెంటనే ‘అయ్యల్లారా! నా దగ్గరున్నవి మామూలు టోపీలు కావు… మాయా టోపీలు.

వీటిని పెట్టుకుని ఆ టోపీలని మాత్రమే లెక్కపెట్టి చూడండి… తప్పి పోయిన వ్యక్తి వచ్చేస్తాడు!’ అన్నాడు. ‘సరే… ఇలా తే!’ అంటూ విసురుగా టోపీలు తలకు పెట్టుకుని వాటిని మాత్రమే లెక్కపెట్టారు.

పది టోపీలు లెక్కతేలాయి! మరో ఇద్దరు లెక్కపెట్టినా అంతే! ‘అరె… అద్భుతం సుమీ!’ అనుకున్నారందరూ. ‘భలే టోపీలోయ్! వీటి ధర ఎంత?’ అని అడిగాడు ఒక శిష్యుడు.

మామూలుకంటే రెట్టింపు ధర చెప్పాడు వ్యాపారి. అయినాసరే అంత సొమ్ము ఇచ్చి, వాటిని కొనుక్కున్నారు. ‘మన ఊరు వెళ్లేదాకా ఎవరూ వాటిని తీయకండి.

లేకుంటే తప్పిపోతారు!’ అనుకుంటూ వాళ్లు వెళ్లడం చూసి… టోపీలమ్మే వ్యక్తి పడీపడీ నవ్వుకున్నాడు!

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment