కష్టానికి గుర్తింపు | Kids’ educational stories Telugu

కష్టానికి గుర్తింపు

Kids’ educational stories Telugu: రంగాపురం అనే ఊళ్లో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు. ఎవరే పని చెప్పినా చేసిపెట్టి, వాళ్లిచ్చే డబ్బు తీసుకునేవాడు. ఏ పనయినా చాలా శ్రద్ధగా, నిజాయతీగా చేస్తాడని అతడికి పేరు.

ఓసారి గోపయ్యను ఆ ఊరి జమీందారు పిలిచి తన దగ్గరున్న పడవకు రంగు లేయమనీ అందుకు యాభైరూపాయలు ఇస్తా ననీ చెప్పాడు.

గోపయ్యకు ఆ డబ్బు తక్కువని తెలిసినా పని పూర్తిచేయడానికి సిద్ధమై… జమీందారు ఇచ్చిన రంగుల్ని తీసుకుని పడవ దగ్గరకు వెళ్లాడు.

అయితే రంగులు వేసేందుకు పడవ లోకి ఎక్కితే దాని మధ్యలో ఓ రంధ్రం కనిపించింది. దాన్ని పూడ్చకుండా రంగులేయడం వల్ల ఉపయోగం లేదనుకున్న గోపయ్య ముందు దాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాడు.

సాయంత్రానికి పని పూర్తి అయింది. జమీందారు మర్నాడు వస్తే డబ్బులిస్తానని చెప్పి గోపయ్యను పంపించేశాడు. మర్నాడు జమీందారు కుటుంబ సభ్యులంతా ఆ పడవ ఎక్కి ఊరవతలకు వెళ్లారు.

అదే రోజు ఊరినుంచి తిరిగొచ్చిన జమీందారు నౌకరుకి ఈ విషయం తెలిసి కంగారుపడుతూ జమీందారు దగ్గరకు వెళ్లి… ఆ పడవకు ఉన్న రంధ్రం గురించి చెప్పాడు.

దాంతో జమీందారు కంగారుతో అప్పటికప్పుడు నది ఒడ్డుకు వెళ్తే కాసేపటికి కుటుంబసభ్యులంతా పడవలో తిరిగి రావడం కనిపించింది. వాళ్లు ఒడ్డుకు చేరుకున్నాక పడవను గమనిస్తే ఎక్కడా రంధ్రం కనిపించలేదు.

విషయం అర్ధమైన జమీందారు అప్పటికప్పుడు గోపయ్యను ఇంటికి పిలిచి… చెప్పినదానికన్నా ఎక్కువ డబ్బు ఇస్తూ ‘రంగులేయమని చెబితే… రంధ్రాన్ని కూడా పూడ్చావు.

నీ మేలు మర్చిపోలేను. నీవల్లే ఈ రోజున నా ఇంట్లో వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు’ అని ప్రశంసించాడు. అలా గోపయ్య మంచితనం ఊళ్లోవాళ్లంతా మరోసారి తెలుసుకుని అతడిని అభినందించారు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment