దంబోద్భవుడు | Moral stories in Telugu PDF

దంబోద్భవుడు

Moral stories in Telugu PDF: ఒకానొకప్పుడు సకల సంపదలకు నిలయమైన ఒకానొక రాజ్యాన్ని దంబోద్భవుడనే రాజు పాలించేవాడు. పరిపాలన ధర్మబద్ధంగా సాగేదే గాని, ఆయనలో మితిమించిన అహంభావం చోటు చేసుకున్నది.

భూలోక ప్రజలందరూ తనను గొప్ప రాజుగా గుర్తించి గౌరవించాలనే తహ తహ ఆయనలో పెరిగిపోయింది. సింహాసనంలో ఆనీ నుడు కాగానే, “మంత్రులారా! సేనాధిపతులారా! రాజప్రతినిధులారా! నాకన్నా శక్తి సంపన్నుడూ, గొప్పవాడూ ఈ భూప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? చెప్పండి!” అని రోజూ అడిగేవాడు.

రాజాగ్రహానికి గురికావడానికి ఇష్టం లేని సభికులు, “లేరు ప్రభూ! లేరు! తమకు సాటి ఎవరూ లేనే లేరు!” అని ముక్తకంఠంతో ఘోషించేవారు.

రాజు సంతోషంతో పొంగిపోయేవాడు. కొన్నాళ్ళకు ఒక ముని ఆ రాజ్యానికి వచ్చాడు. రాజు ఆ మునిని కూడా అదే ప్రశ్న అడిగాడు. అందుకు ముని, “ఉన్నారు ప్రభూ! ఒకరు కాదు, ఇద్దరు!” అన్నాడు.

“నరనారాయణులు! గంధమాదన పర్వతం మీద ఉన్నారు. వాళ్ళే మానవులందరిలోకీ గొప్ప వాళ్ళు!” అని చెప్పి ముని వెళ్ళిపోయాడు.

ముని సమాధానానికి దిగ్భ్రాంతి చెందిన రాజు అమితావేశంతో సైన్యాన్ని వెంటబెట్టుకుని గంధమాదన పర్వతంకేసి బయలుదేరాడు.

తీరా అక్కడికి వెళ్ళి చూస్తే, బక్కచిక్కిన ఇద్దరు మునులు శిఖరాగ్రం మీద కూర్చుని ధ్యాన నిమగ్నులై కనిపించారు. వాళ్ళను చూసిన దంబోద్భవుడు తీవ్రమైన నిరాశకు గురయ్యాడు.

ఇంత దూరం వచ్చి వృధాగా తిరిగి వెళ్ళడం ఇష్టంలేక, వాళ్ళను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. ఫలించలేదు. ఆఖరికి వాళ్ళను పరుష పదజాలంతో దూషించసాగాడు.

అప్పటికి ఇద్దరు మునులలో ఒకడైన నరుడు మెల్లగా కళ్ళు తెరిచి, దావులనున్న దర్భ మొక్కనుంచి మూడు పోచలను తుంచి రాజు సైన్యం కేసి విసిరాడు. మరుక్షణమే సైనికులకు కళ్ళు పోయాయి.

వాళ్ళ రూపాలు కూడా మారిపోయాయి. మునులకున్న ఆధ్యాత్మిక శక్తి ముందు తన బలం తృణప్రాయమేనని దంభోద్భవుడికి అర్థమయింది. ఆయనలోని అహంకారం పటాపంచలయింది.

తన అపరాధాన్ని క్షమించమని మునుల పాదాలపై పడ్డాడు. నరనారాయణులు ఆయన్ను క్షమించి సైనికులకు మళ్ళీ దృష్టిని ప్రసాదించి, యధారూపాలు వచ్చేలా చేశారు.

ప్రజలను కరుణతో పరిపాలించాలనీ, మననులోని అహంభావాన్ని వినయంతో అదుపులో వుంచుకోవాలని రాజుకు బోధించారు. రాజు రాజ్యానికి తిరిగి వచ్చి, అహంకార రహితంగా పరిపాలన సాగిస్తూ, ప్రశాంతంగా జీవితం గడిపాడు!

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment