అక్బర్ – బీర్బల్ పరిచయం | Stories of Akbar and Birbal in Telugu for Kids

Stories of Akbar and Birbal in Telugu for Kids

Stories of Akbar and Birbal in Telugu for Kids: భారతదేశాన్ని పరిపాలించిన మొగలాయి చక్రవర్తులలో అక్బర్ గొప్పవాడు. మతసామరస్యంలో అక్బరచక్రవర్తి చరిత్ర చాలా గొప్పది.

అక్బరు పుట్టినప్పుడు, తండ్రి హుమయూన్ రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో ఉన్నాడు. 1542 లో హుమయూన్ చక్రవర్తి తన కుమారుడు అక్బరు జన్మించిన సందర్భంలో తన వద్దవున్న సుగంధద్రవ్య కస్తూరిని తన వారందరికి పంచిపెట్టాడు.

తన కుమారుని కీర్తి ప్రతిష్టలు కస్తూరి సువాసనలువలె దేశమంతటా వ్యాపించాలని ఆశించాడు. తండ్రి ఆశించినట్లే అక్బరు దేశంలో మంచిపేరును పొందాడు.

అక్బరు మంచి సామరస్యము కలిగినవ్యక్తి, హాస్యప్రియుడు. అతని దర్బారు ప్రతిరోజు పండితులతో, కవులతో – సామంతులతో, ఉద్యోగులతో ఎంతో వేడుకగా సమర్థవంతంగా ఉండేది.

సమయస్ఫూర్తి, యుక్తి – వినోదము అందించడంలో – అక్బరు దర్భారులో బీర్బల్ మంచి చతురుడు. అతనివలన అక్బరు కీర్తి దేశదేశాల వ్యాపించింది.

బీర్బల్ సాధారణ కుటుంబములో పుట్టాడు – చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. దగ్గర బంధువులు చేరదీసి పోషించారు.

పసితనంనుండే బీర్బల్ విద్యాబుద్ధులందు మంచి వివేకము. ఉత్సాహము. చాతుర్యము ప్రదర్శిస్తుండేవాడు. అందరితో పొత్తుగా, వినయముగా మృధువుగా, మాట్లాడుతుండేవాడు.

ఈ మంచిగుణములు వల్ల బీర్బల్ ఎదుటి వారికి వినోదము కలిగేలా మాట్లాడేవాడు. మంచి సమయస్ఫూర్తి పసితనం నుండే అబ్బింది. ఎదుటవారితో యుక్తిగా మాట్లాడి వారిని మెప్పించేవాడు.

మహామేధావియైన బీర్బల్ వివేక విద్యాసంపన్నుడై ఉన్నప్పటికి దరిద్రముతో చాలా బాధపడుతుండేవాడు. గ్రామములోని పెద్దలు అతనిని అక్బరు వద్దకు వెళ్ళి ఆశ్రయించ మని ప్రోత్సహించేవారు.

బీర్బల్ ఢిల్లీకి బయలుదేరి అక్బరుకోటకు వెళ్ళాడు. రాజభటులు అతనిని కోటలోనికి వెళ్ళనియ్యలేదు. తిరిగి తిరిగి ఒకనాడు కొన్ని గుడ్డలను పెద్దమూటగా కట్టుకొని కోట ముందుకు వెళ్ళాడు.

“ఓయీ! కట్టుగుడ్డయినా లేని నిన్ను లోనికి పంపించం” అన్నారు భటులు. “అయ్యలారా! ఆగ్రహించకండి. నేను నిరుపేదనే కాని రాజుగారికి మేలు చేయగల విషయమొకటి చెప్పవలెనని వచ్చితిని.

మీరులోనికి పంపించినచో ప్రభుదర్శనం చేసుకుని విషయం చెప్పి వారి మెప్పును పొందగలవాడను. మెచ్చుకున్న ప్రభువులు నాకిచ్చు పారితోషికములో సగము మీకిచ్చెదను.

నన్ను లోనికి అనుమతించండి” అని వేడుకున్నాడు. “సరే” అని భటులు బీర్బల్ని లోనికి వదిలిపెట్టారు. కొంతదూరం వెళ్ళగా రెండవ దర్వాజా వద్ద భటులు వానిని అడ్డగించారు.

“తనకు వచ్చే బహుమతిలో సగం మొదటి దర్వాజావారికిస్తానని వాగ్దానంచేసాను. మిగిలిన దానిలో సగభాగం మీకు ఇచ్చుకుంటాను” అని బ్రతిమలాడి బీర్బల్ ఆ ద్వారం దాటి మరికొంత దూరంలో ఉన్న మూడవ ద్వారానికి చేరుకున్నాడు.

వాళ్ళుకూడా బీర్బల్ను అడ్డుకున్నారు. వారికి విషయం చెప్పి “మిగిలిన నాల్గవవంతు పారితోషికం మీకు ఇస్తాను” అని ఆ మూడవద్వారం వద్ద గల భటులకు వాగ్దానం చేసి పాదుషావారి దర్బారులోనికి ప్రవేశించాడు.

అక్కడి భటులు వానిని అవతలకు గెంటి వేయబోయారు. అక్బరు ఆ అలికిడి విని, అతని వాలకాన్ని చూచి చిరాకు పడి “వందకొరడాదెబ్బలు కొట్టి వానిని అవతలకు తరిమివేయ” మని ఆజ్ఞాపించాడు.

భటులు వానిని కొరడాలతో కొట్టబోగా “అయ్యలారా! కంగారుపడకండి. పాదుషావారు నాకు ఇచ్చే దానిలో సగం మొదటి దర్వాజావారికి మిగిలిన దానిలో సగము రెండవ దర్వాజావద్ద ఉన్నవారికి, మిగిలిన దానిని మూడవదర్వాజావారికి పంచి నన్ను మాట నిలబెట్టుకో నివ్వండి” అని వేడుకున్నాడు.

పరిస్థితిని, విషయాన్ని, తెలియజెప్పిన బీర్బల్ విజ్ఞతను గమనించిన అక్బరు వానిని మన్నించి, నౌకరులను శిక్షించి బీర్బల్కు తన ఆస్ధానంలో స్వేచ్ఛగా వచ్చేపోయే అనుమతిని ఇచ్చాడు.

కాలం గడుస్తూ ఉంది. బీర్బల్ తరుచుగా పాదుషా వారి దర్శనం చేసుకుంటుండేవాడు. అక్బర్ పాదుషావారికి తమచిత్రపటాన్ని చిత్రీకరింపజెయ్యాలన్నా ఆసక్తి కలిగింది.

ఒకనాడు దర్బారులో తమ అభిలాషను ప్రకటించారు. యధాతధంగా తమ చిత్రాన్ని వేసిన ఉత్తమ చిత్రకారునికి వెయ్యి బంగారు నాణేలు ఇస్తామని చిత్రాన్ని నెల రోజుల తర్వాత ఫలానా తేదీనాడు దర్బారుకు తెచ్చి తమకు సమర్పించాలని ప్రకటించారు పాదుషా.

దేశంలోగల చిత్రకారులంతా తమతమ నైపుణ్యాన్ని ప్రదర్శించి అక్బరు వారి చిత్రాన్ని చిత్రీకరించారు. నిర్ణీత రోజున చిత్రకారులంతా తాము చిత్రీకరించిన చిత్రాలను పాదుషావారికి చూపించారు.

ఏ ఒక్కరువేసిన చిత్రం ప్రభువుల మనస్సును మెప్పించలేదు. ఆ వరుసలో బీర్బల్ ముందుకువచ్చి “జహాపన! దీనిని చిత్తగించండి. ముమ్మూర్తులా మీకు సాటిగా ఉంటుందని” గుడ్డతో చుట్టబెట్టిన దానిని ప్రభువు ముందుంచాడు.

బీర్బల్ నీకు చిత్రలేఖనం కూడ వచ్చునా? నీవు వీరివలనే అంతమాత్రంగా చిత్రీకరించేవా?” అని ప్రశ్నించి ఏది చూపించమన్నారు అక్బర్పాదుషా.

బీర్బల్ నిలువుటద్దాన్ని అక్బరాదుషా ముందుంచేడు. “చూడండి ప్రభూ! కొంచెంకూడా తేడా ఉండదన్నాడు. అద్దంలోని తన ప్రతిబింబాన్ని చూసి బీర్బల్ ఆంతర్యాన్ని గ్రహించాడు.

దేవుని సృష్టికి ప్రతిసృష్టి చేయడం సాధ్యపడే విషయం కాదు. ఎంతటి పనివాడికైనా ఏదో ఒక లోపం ఉండి తీరుతుంది. ఈ విషయం తెలిసొచ్చేలా చేసిన బీర్బలను అభినందించిన మొగలాయి చక్రవర్తి అక్బర్, ఆతడిని తన దర్బార్ విదూషకుడుగా నియమించుకున్నాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment