Telugu kids’ stories | రాజుగారు

రాజుగారు

Telugu kids' stories

Telugu kids’ stories: గొల్లపిల్లవాడు ఒకనాడొక రాజుగారు అడవికి వెళ్ళారు. అక్కడ చాలాసేపు వేటాడి. అలసిపోయి కొండపైనున్న ఒక చెట్టునీడలో కొంతసేపు విశ్రాంతి తీసుకొన్నారు.

ఆయనకు అక్కడి ప్రకృతి ఎంతో అందంగా కన్పించింది. ఆయన గొప్ప చిత్రకారుడు. అందుచేత అచ్చటి అందాలను రంగులతో మేళవించి చక్కని చిత్రం గీయాలనుకొన్నారు.

వెంటనే వెళ్ళి గుర్రానికి వ్రేలాడుతున్న సంచీనుండి చిత్రలేఖనానికి కావల్సిన సామాన్ల నన్నిటినీ తెచ్చుకొని చిత్రాన్ని తయారుచేశారు.

దాని అందానికి ఆయన ముగ్ధుడై అన్నిప్రక్కలనుండి చూచి ఆనందించాలని తలచి, మొదట కుడిప్రక్కకు, తర్వాత ఎడమ ప్రక్కకు, మరలా ఎదుటివైపునకు వెళ్ళి చూస్తున్నారు.

కొంచెం కొంచెం వెనుకకు నడుస్తూ దాని అందాన్ని చూసి సంబరపడసాగారు. కాని ఆయన వెనుకనున్నది కొండకొన. అది దాటితే ఆయన లోయలో పడిపోవడం ఖాయం.

కాని ఆయన అది గమనించడం లేదు. ఈ విషయాన్ని ఆ దారినపోతున్న ఒక గొల్లపిల్లవాడు చూశాడు. వాడు చాలా తెలివైనవాడు. “అయ్యో! రాజుగారు లోయలో పడిపోయేటట్లున్నారు.

ఎట్లాగైనా ఆయన్ని రక్షించాలి” అనుకొన్నాడు. ఒకవేళ కేకవేసి చెప్పుదామంటే ఆయన కంగారుపడి లోయలోకి తూలిపడవచ్చు. అందుచేత వానికొక ఉపాయం తట్టింది.

వాడు గబగబా చిత్రాన్ని వ్రేలాడదీసిన కొయ్యవద్దకు వెళ్ళి చిత్రాన్ని పుటుక్కున చింపివేశాడు. రాజుగారు కోపంతో రుద్రుడైపోయి వాని చెంప ‘చెళ్ళు’ మనిపించారు.

తర్వాత ‘ఎందుకిట్లా చేశావని’ అడిగారు. “మీరు కొండకొనమీద నిలబడి ఉన్నారు. ఒక్క అడుగు వెనక్కువేస్తే మీరు లోయలోపడి పోవడం ఖాయం.

అందుచేత మిమ్మల్ని రక్షించడానికే నేనీ పనిచేశాను” అని చెప్పాడు వాడు. రాజుగారు ఒకసారి వెనుకకు చూచి “ఔను! నిజమే!” అని తమతప్పు తెలిసికొన్నారు.

ఆ పిల్లవానికి ధన్యవాదాలు చెప్పి తనతోబాటుగా తన రాజధానికి తీసుకొనిపోయి, అచ్చట వానికి విద్యాబుద్ధులు నేర్పించారు. తర్వాత ఆ పిల్లవాడే అఖండ తెలితేటలతో పెద్దవాడై రాజుగారి ముఖ్యమంత్రి అయ్యాడు.

నీతి: సమయానికి తెలివి ఉంటే ఆపదలు రావు

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment