చూసే దృష్టి | Telugu Neethi Kathalu Collection

చూసే దృష్టి

Telugu Neethi Kathalu Collection: విష్ణుశర్మ అనే పండితుడు ఒక గురుకులాన్ని నడిపేవాడు. అతడు సకలశాస్త్ర పారంగతుడు. చుట్టుపక్కల ప్రాంతాలలో ఆయనకు మంచి పేరు ఉండేది.

ఆ కారణంగా ఆయన దగ్గర అనేకమంది శిష్యులు ఉండే వారు. వారిలో దిలీపుడు అనే శిష్యుడు విష్ణుశర్మతో సన్నిహితంగా మెలిగే వాడు. నిరంతరం గురువు వెంటే తిరుగుతూ సందేహాలను నివృత్తి చేసుకొనేవాడు.

ఒకరోజు విష్ణుశర్మ తన దగ్గర ఉండే శిష్యులలో ముగ్గురిని పిలిచాడు. మొదటి శిష్యుడితో, “నువ్వు ఈ రాజ్యమంతా తిరిగి నీ కన్నా తెలివైన వ్యక్తిని ఒకరిని తీసుకొని రావాలి” అని చెప్పాడు.

రెండో శిష్యుడితో “నీకన్నా తక్కువ తెలివి ఉన్న వ్యక్తిని తీసుకురావాలి” అని చెప్పాడు. మూడో శిష్యుడితో “నీ కన్నా తెలివి ఎక్కువ ఉన్న ఒక వ్యక్తిని, నీకన్నా తక్కువ తెలివి ఉన్న ఒక వ్యక్తిని తీసుకొని రావాలి” అని చెప్పాడు.

గురువు ఆజ్ఞ మేరకు ఆ ముగ్గురు శిష్యులు వెంటనే బయలు దేరి వెళ్లారు. కొంతకాలానికి ఆ ముగ్గురూ తిరిగి వచ్చారు. శిష్యులు ముగ్గురు మాత్రమే తిరిగి రావటం చూసిన దిలీపుడు గురువు దగ్గరకు వెళ్లి “గురువర్యా! ఆ ముగ్గురే తిరిగి వచ్చారు.

మీ ఆజ్ఞ ప్రకారం వారితో మరో నలుగురు రావాలి కదా, ఎందుకు రాలేదో నాకు అంతు పట్టడం లేదు” అన్నాడు.. అప్పుడు గురువు “అందుకు కారణాన్ని వారి నోటి వెంటే | విందువు గాని పద” అని ముగ్గురు శిష్యుల దగ్గరికి వచ్చాడు.

మొదటి శిష్యుడు “ఈ రాజ్యంలో అందరూ నా కన్నా తక్కువ తెలివి ఉన్నవారే కనిపించారు. అందుకే నేనొక్కడినే వచ్చేశాను” అని చెప్పాడు.

రెండో శిష్యుడు “అందరూ నా కన్నా తెలివైన వారే ఎదురు పడ్డారు. నా కన్నా తక్కువ తెలివి ఉన్నవారు ఒక్కరు కూడా. దొరకలేదు,” అని చెప్పాడు. మూడో శిష్యుడు “అందరూ నాతో సమానమైన తెలివితేట లనే కలిగి ఉన్నారు.

అందుకే మీరు చెప్పిన ఇద్దర్ని తీసుకురాలేక పోయాను ” అని చెప్పాడు. వారి సమాధానాలు విన్న దిలీపుడు ఆశ్చర్యంతో, “గురు వర్యా! వీరు ముగ్గురు వెళ్లింది ఒక రాజ్యానికే కదా! కాని ముగ్గురూ మూడు రకాలుగా మాట్లాడుతున్నారు.

కారణం వివరించండి” అని గురువుని కోరాడు. అప్పుడు గురువు “ఒకరేమో తాను చాలా తెలివైనవాడిననే అహంకారంతో అందర్నీ పరిశీలించటంతో అతనికన్నా తెలివైన వాళ్లు ఎవరూ కనిపించ లేదు.

మరొకరేమో తాను అందరి కంటే తక్కువ అనే న్యూనతా భావంతో పరిశీలించటంతో అందరూ తన కన్నా తెలివైన వారిగానే కనిపించారు.

ఇంకొకరికి అందరూ తనలాంటి వారే అనే దృష్టి ఉండటం వలన అందరూ తనలాంటి తెలివి ఉన్నవారే కన్పించారు. మనం చూసే దృష్టిని బట్టి ఇతరులపైన మన అభిప్రాయాలు మారుతూ ఉంటాయి,’ అని వివరించాడు.

గురువు తనకు ఉపదేశించదలచుకున్నది ఏమిటో దిలీపుడు గ్రహించాడు. అప్పటి నుంచి దిలీపుడు ఆత్మన్యూనతను గాని, అహంకారాన్ని గాని దరిచేరనీయకుండా ఆత్మవిశ్వాసంతో జీవించాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment